ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం “బోధన” యొక్క అర్ధం ఏమిటంటే, ఏదైనా ఎలా చేయాలో  ఉదాహరణ లేదా అనుభవం ద్వారా ఏదైనా నేర్చుకోవటానికి లేదా అర్థం చేసుకోవడానికి, జ్ఞానం కలుగజేయడం లేదా తర్ఫీదు ఇవ్వటం.

దేవుని రాజ్యంలో బోధన చాలా ముఖ్యమైన విషయం. ఏదైనా ఒక కోర్సును బోధించడం అనేదానిని ఒక ఉదాహరణగా తీసుకుంటే, ఎవరైతే ఆ కోర్సుకొరకు దరఖాస్తు చేసుకున్నారో, వారికి మాత్రమే ఆ కోర్సుకు సంబంధించిన శిక్సణ ఇవ్వబడుతుంది. దరఖాస్తు చెయ్యని వారికి శిక్షణ అందుబాటులో ఉండదు.

అదే విధంగా, ప్రభువైన యేసుక్రీస్తును వారి వ్యక్తిగత రక్షకుడిగా స్వీకరించిన వారికి మాత్రమే దేవుని రాజ్య నివాసులకొరకైన బోధన మరియు శిక్షణ ప్రభువు సంఘము ద్వారా ఇవ్వబడుతుంది. వ్యక్తిగత రక్షకుడు అంటే ఏమిటి? వ్యక్తిగతం అంటే, తనకు మాత్రమే సంబంధించిన విషయాలు. అంటే, ఒకరి బలాలు, బలహీనతలు, ఇష్టాలు, ఆలోచనలు, కోరికలు ఇలా ఇతరుల ప్రమేయం అంగీకరించలేని విషయాల పరిధిని, వ్యక్తిగతం అని అంటాము. ఇలాంటి వ్యక్తిగతమైన విషయాలలో యేసు క్రీస్తును ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరించడమే ఆయనను స్వంత రక్షకుడుగా అంగీకరించడం. ఆ వ్యక్తిగతమైన విషయాలలో ప్రభువు మాట పాటించడానికి లోబడతాను అని అంగీకరించడం. 

మనం ఏమి నేర్పించాలి? యేసు పరలోకానికి వెళ్ళే ముందు, “నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి- మత్తయి 28:20”. అలాగే, యేసు ఇలా అన్నాడు – “ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. – యోహాను 14:26”. ఎఫెసీయులకు 4: 11-13  లేఖన భాగం, దేవుని వాక్యం బోధన యొక్క అవసరాన్ని స్పష్టంగా తెలుపుతుంది.

మనమందరము విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభి వృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను- ఎఫెసీయులు  4:11-13

“దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది – 2 తిమోతి 3:16,17” అనే వాక్యము చెప్పినట్టుగా, బింకం గాస్పెల్ వర్క్స్, విశ్వాస సంబంధమైన బోధనలు, దేవుడు మనకు అందుబాటులో
ఉంచిన తన వాక్యము ద్వారా బోధించుటకు కట్టుబడిఉంది.