క్రీస్తు శరీరము

Table of Contents

ఉపోద్ఘాతము

యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు, చివరి పస్కా పండుగ సమయములో, గాడిదపిల్లపై జయోత్సవగానములతో యెరూషలేము వెళ్ళిన తరువాత, దేవాలయమునకు వెళ్ళెను. అక్కడ క్రయవిక్రయములు చేయువారిని, రూకలు మార్చువారిని చూసి, వారినందరిని అక్కడనుండి వెళ్ళగొట్టి, “నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్ధన మందిరము అనబడును”, అని వ్రాయబడలేదా? మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అని చెప్పెను. అప్పుడు అక్కడ ఉన్న యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావుకదా? మాకు ఏమి సూచక క్రియ చూపింతువు? అని ఆదిగినప్పుడు, మీరు ఈ దేవాలయమును పడగొట్టుడి, నేను మూడు దినములలో దానిని కట్టెదను అని చెప్పెను. అనేకులు ఈయనకు మతి భ్రమించినది అని అనుకున్నారు (మార్కు  11: 15-17, యోహాను 2:19). శిష్యులకు అప్పుడు అర్ధం కాలేదు. అయితే ప్రభువు తిరిగిలేచిన తర్వాత శిష్యులకు అర్ధం అయింది. యేసు చెప్పినది తన శరీరము గా పిలువబడే సంఘము అనే దేవాలయము గురించి అని (యోహాను 2:22 ). 
 
ప్రభువైన యేసు మరణం, భూస్థాపన, పునరుత్ధానం విశ్వసించే మనము, ప్రభువు చేత కట్టబడిన ఈ ఆలయానికి చెందినవారము. ఈ ఆలయానికి, ఒక నిర్దిష్టమైన క్రమము ఉంది, నిర్దిష్టమైన విధులు విధానాలు కూడా ఉన్నాయి. ఈ పత్రిక యొక్క ఉద్దేశము ఏమిటంటే, ప్రభువు శరీరము అనే ఈ ఆలయం యొక్క క్రమము మరియు పరిచర్యలు అందరమూ స్పష్టంగా అర్ధంచేసుకోగలగాలి అని. 
 

దేవాలయ అమరిక

సంఘము అను శరీరమునకు ఆయనే (యేసు ప్రభువే)శిరస్సు – కొలస్సీ 1:18

 1. శిరస్సు (ప్రభువు)
 2. శరీరము (సంఘము)

శిరస్సు

శిరస్సు లేదా తల అనేది మన శరీరంలో ప్రధానమైనది, మరియు ఇతర అవయవాలను నియంత్రించేది అని మనకు తెలుసు. అయితే ఈ శిరస్సు అనేది సంఘము అనే నిర్మాణాత్మక క్రమంలో ఎలా ఉంటుందో చూద్దాం. ఏదైనా సంస్థ మనం గమనించినప్పుడు, దానిని స్థాపించిన వ్యక్తిని తల లేదా శిరస్సుగా అర్ధంచేసుకోవచ్చు. ఈ వ్యక్తి, తన సంస్థ బాగా నడిపించబడటానికి మరికొందరిని నియమిస్తాడు. ఈవిధంగా సంఘమును క్రమముగా నడిపించటానికి, శిరస్సైన యేసుప్రభువు ఏమి చేసారో చూద్దాం. 
 

సంఘాన్ని స్థాపించెను

ప్రభువైన యేసుక్రీస్తు తన సిలువ మరియు భూస్థాపన మరియు పునరుత్థాన ప్రక్రియ ద్వారా సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘాన్ని నిర్మించడానికి కల్వరి శిలువపై తన రక్తాన్ని చిందించాడు. ఆయన యోహాను 2: 19 లో చెప్పినట్లుగా, ఈ సంఘాన్ని 3 రోజుల్లో నిర్మించాడు.

 1. మొదటి రోజు: లోకమంతటికొరకు పాపపరిహారార్ధబలిగా తనను తానే సిలువపై అర్పించుకొన్నారు (యెషయా 53:10)
 2. రెండవ రోజు: పాతాళము మరియు మరణము యొక్క తాళపుచెవులు స్వాధీనపరచుకొన్నారు (ప్రకటన 1:18)
 3. మూడవ రోజు: తిరిగిలేచి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు (లూకా 24:6), మరియు సంఘమును నిలబెట్టుటకు పరిశుద్దాత్మను పంపెను.

పరిశుద్ధాత్మను నాయకుడిగా పంపెను

సంఘాన్ని స్థాపించి దానికి నాయకుడిగా ఉండి, నడిపించటానికి, క్రమపరచడానికి, ప్రోత్సహించటానికి, బోధించటానికి మరియు ప్రత్యక్షతను అనుగ్రహించటానికి, పరిశుద్ధాత్మను పంపించారు. పరిశుద్ధాత్మ యొక్క కార్యములు మనం గమనించినప్పుడు
 1. ఆదరణకర్త: పరిశుద్ధాత్మకు తండ్రి చిత్తము తెలియును. ఆయన విశ్వాసులతో మరియు వారిలోను ఉండి, యేసు బోధించిన విషయములను జ్ఞాపకము చేయును (యోహాను 14-16,17, 26). మనము దేవునికి సంబంధించిన వారము అని సాక్ష్యము ఇచ్చువాడు ఆయనే (రోమా 8: 16). 
 2. యేసు గురించి సాక్ష్యము చెప్పువాడు: పరిశుద్ధాత్మ యేసును గూర్చిన సాక్ష్యము ఇచ్చును (యోహాను 15: 26, 27). 
 3. ఒప్పింపజేయువాడు: లేఖనము గమనించినట్టయితే, పరిశుద్ధాత్మ ప్రధానంగా 3 విషయాలలో లోకమును గద్దించువాడుగా ఉన్నాడు. (యోహాను 16: 8-11).
  1.  పాపము: లోకులు ఆయనయందు విశ్వాసముంచలేదు గనుక, వారి పాపము పరిహరింపబడలేదు అని గద్దించును
  2. నీతి: శిష్యులు యేసును మరెన్నడునూ చూడరు గనుక, వారు నీతి విషయములో, తడబడినప్పుదు, నీతి ప్రభువునందలి విశ్వాసము వలననే అనే సంగతి జ్ఞాపకము చేసి గద్దించును.
  3. తీర్పు: ఈ లోకాధికారి తీర్పును పొందియున్నాడు గాబట్టి, అతనిని అనుసరించు ప్రతివాడు, వాడివెంట తీర్పులోనికి పోవును అని గద్దిస్తాడు. 
 4. మార్గదర్శకుడు: పరిశుద్ధాత్మ తండ్రి నుండి వినినవాటిని సంఘమునకు తెలియచేయును. రాబోవు సంగతులను సంఘమునకు తెలియచేయును. ఎల్లప్పుడూ యేసును మహిమపరచును.  (యోహాను 16: 13-15). 
 5. సంఘమును బలపరుచువాడు: పరిశుద్ధాత్మ సంఘమును బలపరుచును (లూకా 24:49 and అ. పొ. కా 1:8). ఎలా బలపరుచుచున్నాడంటే, సంఘమునకు కావలిసిన వరములు, వనరులు దయచేసి బలపరుచుచున్నాడు. We will list them now
  1. ప్రార్ధన చేయుటలో సహాయము చేయును: ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు (రోమా 8:26)
  2. విశ్వాసులకొరకు విజ్ఞాపన చేయును: ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనముచేయుచున్నాడు (రోమా 8:27)
  3. శరీర క్రియలను లయముచేయుటయందు సహాయము చేయును. (రోమా 8: 13)
  4. పరలోకమందున్న తండ్రియైన దేవునిని, అబ్బా, తండ్రీ అని మొరపెట్టగలిగే నిశ్చయత అనుగ్రహించియున్నాడు(రోమా 8: 15)
  5. మనము దేవునివారము అని మనకు నిశ్చయత కలుగజేయును (రోమా 8:16)
  6. ఆత్మీయ వరాలను విశ్వాసులకు విభజించి తన చిత్తానుసారముగా పంచిపెట్టును (1 కొరింథీ 12:4 – 11)
  7. ఆత్మీయ ఫలాలు మనము ఫలించులాగున మనకు సహాయము చేయును
ఈ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ, పరిశుద్ధాత్మ తండ్రి చిత్తాన్ని, ప్రభువైన యేసు ఉద్దేశాన్ని సంఘములో నెరవెర్చువాడిగా ఉన్నాడు. విశ్వాసవిష యములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుట, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభి వృద్ధి చెందుట (ఎఫెసీ 4:13)  కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలువబెట్టు (ఎఫెసీ 5:26, 27), తండ్రి చిత్తము, యేసు ఉద్దేశము అయి ఉన్నాయి.
 

శరీరము

పరిశుద్దాత్మ  పెంతెకోస్తు పండుగ దినాన సంఘమును ప్రారంభించినాడు. యేసు ప్రభువు శిష్యులతో, మీరు పైనుండి శక్తి పొందువరకు యెరుషలేములో నిలిచియుండుడి అని ఆరోహణమయ్యే ముందు చెప్పెనుఅపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయము మనము గమనించినట్టయితే- 

ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను–మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.   – అ. పొ. కా 1: 4, 5, 8

ఆ పెంతెకోస్తు దినాన, పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన కార్యము జరిగింది. దానిగురించి మనకు అందరికీ తెలిసినదే. వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ, అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి (అ. పొ. కా 2:1-4). ఆ దినాన పామరుడైన పేతురు, పరిశుద్ధాత్మ సహాయముతో ఒక జ్ఞానివలె మాట్లాడినాడు. యేసు వారిని విడిచి పరమునకు వెళ్ళినతరువాత మొదటి సారి సువార్త ప్రకటించారు. ఆ రోజు 3000 మంది సంఘమునకు చేర్చబడ్డారు. 
మొదటి సంఘం ఈ 3000 మందితో,  యెరూషలేములో ప్రారంభమయింది. ఆవిధంగా సంఘ పరిచర్య ప్రారంభించబడింది. అపొస్తలుల కార్యములు మనం ధ్యానించినపుడు, ఆ సంఘములో జరిగిన అనేక పరిచర్యలు మనము గమనించగలము.
 1. బోధ (వాక్య పరిచర్య)
 2. రొట్టె విరుచుట (బల్ల సహవాసము)
 3. ప్రార్ధన
 4. కలిగినవి అమ్మి, సంఘముగా బ్రతుకుట (Acts 2:45)
 5. సంఘముగా దేవాలయములోను, ఇళ్ళలోనూ కూడుకొనుట
 6. నూతన విశ్వాసులు చేర్చబడుట
 7. స్వస్థత(అ. పొ. కా 3:7, అ. పొ. కా 4:22, అ. పొ. కా 5:15, 16)
 8. సంఘము విశ్వాసుల అవసరములు చూసుకొనుట (అ. పొ. కా 4:35 and అ. పొ. కా 6:1,2)
ఈ సంఘమును గమనించినప్పుడు క్రమముగా ఇది, స్థానికముగా ఏర్పరచబడబోయే భవిష్యత్తు సంఘాలకు ఒక నమూనా వలే ఉన్నట్టుగా చూడగలము. యెరూషలేములో గొప్ప శ్రమలు కలిగినప్పుడు సంఘము చెదరిపోయి వేర్వేరు ప్రదేశాలకు తరలిపోవలసివచ్చింది. అలా వెళ్ళినవారు, ఇక్కడ పరిశుద్ధాత్మ నడిపించిన క్రమము ప్రకారం కొనసాగించడం మనము ఇతర పత్రికల ద్వారా మనము గమనించవచ్చు.
 

పరిశుద్ధాత్మ సంఘమును క్రమపరచెను

పరిశుద్ధాత్మ మొదటి సంఘములలో జరిగించిన పరిచర్యను గమనించినప్పుడు, అది రెండు విధములుగా మనం చూడవచ్చు.
 1. ఆత్మీయ క్రమము
 2. నిర్వహణ క్రమము

ఆత్మీయ క్రమము 

ఈ క్రింది పటము ఆత్మీయ క్రమాన్ని సూచిస్తుంది. దానిలో మనము కొన్ని పరిచర్యలు మరియు విభాగాలు చూడగలము.

 

 

విభాగాలు

 1. అపొస్తలులు (అపొస్తొలోస్ గ్రీ. G652): ఆజ్ఞలు ఇచ్చి పంపబడినవారు (Mathew 28:19,   Mark 16:15, Mathew 10:1). . సమకాలీన సంఘములో దేవుని దర్శనం ద్వారా పరిచర్య ప్రారంభించిన వారిని అపొస్తలులు అంటున్నారు. ఏ పరిచర్య అయినా పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ అపొస్తలులతో ప్రారంభించిన పరిచర్య కొనసాగింపే కాబట్టి, 12 మంది శిష్యులతో అపొస్తలుల క్రమం సంపూర్ణం అయింది అనికూడా మనం అనుకోవచ్చు. సంఘములను స్థాపించడం, అపొస్తలుల పరిచర్య అని కొంతమంది అంటారు, అయితే మొదటి సంఘముకు శ్రమలు సంభవించినప్పుడు, మిగతా సంఘాలు క్రమక్రమముగా ప్రారంభం అయ్యాయి. దీనిని సంఘ విస్తరణగా చూడగలము, ప్రత్యేకముగా అపొస్తలుల పరిచర్య అని మనకు బైబిల్ లో వ్రాయబడలేదు.
 2. ప్రవక్తలు (ప్రోఫెటెస్ గ్రీ. G4396): ప్రవక్తలు దేవుని చిత్తానుసారముగా దేవుని ప్రజలను హెచ్చరించుటకు, బలపరుచుటకు, మార్గనిర్దేశము చేయుటకు అలాగే దేవుని సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగించు నిమిత్తము రాబోవువాటిని తెలియజేయుటకు ఏర్పాటుచేయబడిన వారు. ప్రవక్తల పరిచర్యను సమకాలీన ప్రపంచంలో ప్రాపంచిక విషయాలలో కూడా భవిష్యత్తు తెలియజేసే ఒక పరిచర్యగా భావిస్తున్నారు. మొదటినుండీ దేవుడు తన ప్రజలు, తనతో ఉండవలసిన సంబంధము, వారికొరకై దేవుని ప్రణాళికలను తెలియచేయడము అనే ఉద్దేశముతోనే ప్రవక్తలను పంపడం మనము గమనించగలము. 
 3. సువార్తికులు (యువెగ్గెలెస్టెస్ గ్రీ. G2099): ప్రభువును ఎరుగని వారికి, యేసుక్రీస్తు చేసిన సిలువ త్యాగము, ఆయనను విశ్వసించుటద్వారా కలిగే పరలోకభాగ్యము గురించి ప్రకటించేవారు.
 4. కాపరులు (పోయ్‌మెన్ గ్రీ. G4166): వీరు, స్థానిక సంఘములో విశ్వాసులను కాచెడివారు. స్థానిక సంఘములోని విశ్వాసులు సరియైన బోధ అభ్యసించుటకు, వారి జీవితాలు బోధప్రకారము ఉండులాగున వారికొరకు ప్రయాస పడువారు, ఈ కాపరులు.
 5. బోధకులు (డిడాస్కలోస్ గ్రీ. G1320): దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ సహాయముతో, సంఘమునకు నేర్పేవారు బోధకులు.

పరిచర్యలు

 1. వాక్య పరిచర్య
 2. స్వస్థత
 3. అద్భుతములు
 4. ప్రవచించుట
 5. ఆత్మల వివేచన: 
 6. అన్యభాషలు మాట్లాడుట
 7. భాషల అర్ధము చెప్పుట

నిర్వహణ క్రమము 

సంఘంలోని ప్రారంభ విషయాలను గమనిస్తే, ప్రతీ ఒక్కరు తమకు కలిగినవాటిని అమ్మి, అపొస్తలులకు ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వబడిన ఆస్తులను సంఘంలోఉన్న అందరికొరకు వాడటం జరిగింది. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం చూస్తే, అక్కడ దినదినమూ విశ్వాసులకు భోజన పరిచర్య మరియు ఇతర అవసరాలకొరకు పరిచర్య జరిగినట్టుగా చూడగలము. ఇవన్నీ అత్మీయ పరిచర్యలు కాదుగాని, విశ్వాసుల భౌతిక మరియు సామాజిక అవసరాల కొరకైన పరిచర్య. వీటిని సరియైన విధానంలో జరిగించడం కొరకు 7గురు ఆత్మీయ పరిపక్వత కలిగిన వారిని ఏర్పాటుచేసినట్టుగా అదే అధ్యాయంలో మనం చూడవచ్చు. 
 
అయితే పౌలు తిమోతికి మరియు తీతుకు వ్రాసిన పత్రికలలో ఈ క్రమము గురించి అర్హతల గురించి ఇంక విపులం గా వ్రాయడం మనం చూడగలం. 
ఇక్కడ మూడు రకాలైన నిర్వహణ అధికారులను మనం చూడగలం.
 1. అధ్యక్షులు (ఎపిస్కోప్ Gr. G1984): సంఘములోని అన్ని విషయాలు క్రమముగా జరుగులాగున పర్యవేక్షణ చేయువాడు  . 
 2. పెద్దలు (ప్రెస్బైటెరొస్ Gr. G4245): వయసులోను, అత్మీయ అనుభవములోను వృద్ధి కలిగినవాడు.  
 3. పరిచారకులు (డయకొనోస్ Gr. G1249): సంఘములోని నాయకులకు సహాయకారులుగా పనిజరిగించువారు.
ప్రభువైన యేసుక్రీస్తు ప్రణాళిక ప్రకారం, సంఘము దాని పరిచర్యల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతి విశ్వాసియొక్క ఆత్మీయ ఎదుగుదల. ఆ నిర్వహణ క్రమము అనేది ఆత్మీయ క్రమముకు సహాయకారి మాత్రమే గాని, అదే ప్రధానమైనది కాదు. 
 
స్థానిక సంఘములలో కాపరి ఇతర పరిచర్య విభాగాలైన బోధించుట, స్వస్థపరుచుట, ప్రవచించుట ద్వారా,  ప్రార్ధనా పూర్వకముగా  సంఘమును ప్రభువు చిత్తానుసారముగా పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడి కాయువాడు. అతడు లెక్క అప్పగించవలసిన వాడు. అలాగే నిర్వహణ క్రమములోని వారు కాపరితో కలసి సంఘపరిచర్య మర్యాదపూర్వకముగాను క్షేమాభివృద్ధికరముగాను జరిపించవలసిన బాధ్యత గలవారు. 
 
1 పేతురు 2:5 ప్రకారము యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 1 కొరింథీ 3:16 ప్రకారం, వ్యక్తిగతంగానూ మీరు దేవుని ఆలయమై యున్నారు. దేవుని జ్ఞానము మనుష్యుని జ్ఞానముకంటే గొప్పది. ఒక విశ్వాసికి తన ఆత్మీయ అభివృద్ధికి అవసరమైన ప్రతి ఏర్పాటునూ,  ప్రభువు  సంఘముద్వారా ఇచ్చినాడు. మనము చేయవలసినది ఏమిటంటె యేసుక్రీస్తు అపొస్తలులకు దయచేసిన బోధయందును, ప్రభువైన యేసుక్రీస్తు కలువరి కార్యమును జ్ఞాపకము చేసికొనుటకై రొట్టెవిరుచుటయందును , నీవు నివసించుచున్న రాజ్యముకొరకు, నీవున్న స్థానిక సంఘము మరియు సార్వత్రిక సంఘముకొరకు, తోటి విశ్వాసుల కొరకు ప్రార్ధన విజ్ఞాపనలు చేయుటయందును  ఎడతెగక ఉండుటయే. 
 
దేవుడు తన జ్ఞానమును మనకు దయచేసి, సంఘముయొక్క ఐక్యత అర్ధముచేసికొనిన వారమై, పరిశుద్ధాత్మకు సహకరిస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మారులాగున తన కృప దయచేయును గాక! ఆమెన్!